జగన్ మరో సంచలనం..! ఏడాది ముందే ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన..!!
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వై.యస్.జగన్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. 18 నెలల ముందుగానే ఎన్నికల శంఖారావం పూరించిన జగన్.. అదే జోరును మరింత పెంచనున్నారు. ప్రతి అడుగూ పక్కాగా వేసుకుంటూ వెళ్తున్న జగన్.. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి రెండోసారి అధికారంలోకి రావాలని తపిస్తున్నారు. ఈసారి టార్గెట్ 175 సీట్లు. అంటే ప్రతిపక్షానికి ఒక్క అసెంబ్లీ కూడా దక్కకూడదనేంత పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. అది సాధ్యమవుతుందో లేదో తెలీదు కానీ.. తాను మాత్రం ప్రయత్నించడంలో తప్పులేదనుకుంటున్నారు. అదే విషయాన్ని ఎమ్మెల్యేలకు పదే పదే చెప్తున్నారు. అంతేకాక.. ఈసారి ఏడాది ముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు సంకేతాలిచ్చారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల పనితీరుకు ప్రాతిపదికగా భావిస్తున్నారు జగన్. ఐప్యాక్ టీం ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంపై సర్వే చేసి జగన్ కు నివేదికలు అందిస్తోంది. రోజువారీగా, వారం వారీగా, నెల వారీగా నివేదికలు జగన్ కు చేరుతున్నాయి. ఎవరైతే ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారో వారికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్టు ఐప్యాక్ టీం తేల్చింది. అందుకే జగన్ కూడా ఈ ప్రోగ్రామ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులంతా తప్పకుండా ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశిస్తున్నారు. అలా వెళ్లని వాళ్లు రేసులో వెనుకబడుతున్నారని తేల్చి చెప్పారు.
గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా వెనుకబడ్డారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పలరాజు, గుమ్మనూరి జయరాం పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లకుండా మీడియా ముందు కనిపిస్తూ ఉంటే ఉపయోగం లేదని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ముద్దిశెట్టి వేణుగోపాల్, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. మహీధర్ రెడ్డి, శ్రీనివాస్ నాయుడు పనితీరుపైన కూడా జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
ఈసారి జరగబోయే ఎన్నికలు కులాల మధ్య జరగబోవట్లేదని జగన్ చెప్పారు. పేదలకు, పెత్తందారీలకు మధ్య జరుగబోతున్న ఈ యుద్ధంలో మళ్లీ తాము అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు జగన్. లేకుంటే పేదవారిని కాపాడేవారు ఎవరూ ఉండరన్నారు. అందుకే ఇంటింటికీ వెళ్లి వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించాలన్నారు. అందుకే ఈసారి ఏడాది ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించబోతున్నట్టు సూచనప్రాయంగా వెల్లడించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చివరి సమీక్ష వచ్చే ఏడాది మార్చి నెలలో ఉంటుందన్న జగన్.. ఆ సమీక్షలోనే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. అంటే 2024 ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలకు 2023 మార్చి – ఏప్రిల్ మాసాల్లోనే అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. దీంతో ఎవరికి టికెట్ దక్కుతుందో.. ఎవరికి నిరాకరిస్తారో.. అనే గుబులు ఇప్పటి నుంచే మొదలైపోయింది. మరి జగన్ పరీక్షలో ఎవరు పాస్ అవుతారో చూడాలంటే మార్చి వరకూ వెయిట్ చేయాల్సిందే..!













