Visakha Mayor: GVMCలో కూటమి జోరు.. సమావేశం కంటే ముందే చేతులెత్తేసిన వైసీపీ..?
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ హరి వెంకట కుమారిపై (Mayor Hari Venkata Kumari) అవిశ్వాస తీర్మానం కోసం రేపు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎందుకంటే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇటు కూటమి (NDA), దాన్ని కాపాడుకునేందుకు వైసీపీ (YCP) తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు (Corporators) వైసీపీకి గుడ్ బై చెప్పేసి కూటమి పార్టీల్లో చేరిపోయారు. అయితే వీళ్లంతా తమ పార్టీ నుంచే గెలవడంతో వాళ్లకు విప్ (Whip) జారీ చేసింది వైసీపీ. దీంతో రేపటి మీటింగ్ ఎలా జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది.
GVMC కౌన్సిల్లో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి మొత్తం 111 ఓట్లు ఉన్నాయి. అవిశ్వాస తీర్మానం గెలవాలంటే 74 ఓట్లు అవసరం. ప్రస్తుతం కూటమి వద్ద 64 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్-అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 75 మంది సభ్యుల బలం ఉంది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఈ నెంబర్ సరిపోతుంది. వైసీపీ తన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసి, అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని ఆదేశించింది. అయితే ఈ విప్ జారీ తర్వాత వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కౌన్సిల్లో వైసీపీ చీఫ్ విప్‌గా ఉన్న లక్ష్మీప్రియాంక (Lakshmi Priyanka) పార్టీకి రాజీనామా చేశారు. ఈవిడ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas) కుమార్తె. ఈమె రాజీనామా వైసీపీ శ్రేణుల్లో కలవరం రేపింది. దీంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 30కి పడిపోయింది.
కూటమి ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని, తమకు సంఖ్యాబలం అనుకూలంగా ఉందని వైసీపీ మేయర్ హరి వెంకట కుమారి ఆరోపించారు. అయితే కూటమి నాయకులు ఈ ఆరోపణలను ఖండిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం విజయవంతం కావాలంటే సంఖ్యాబలం కీలకం కావడంతో, కూటమి తన కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కొందరు కూటమి కార్పొరేటర్లను మలేషియా పంపించింది. శుక్రవారం సాయంత్రం వీళ్లంతా విశాఖకు చేరుకోనున్నారు.
ప్రస్తుత సంఖ్యాబలం పరంగా కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉంది. లక్ష్మీప్రియాంక రాజీనామాతో వైసీపీ మరింత బలహీనపడింది. అయితే చివరి క్షణంలో కార్పొరేటర్ల మనసు మార్చే అవకాశం లేదా ఊహించని రాజకీయ పరిణామాలు తీర్మాన ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చు. మొత్తంగా రేపటి సమావేశం విశాఖ రాజకీయాల్లో కీలక మలుపును తీసుకొచ్చే అవకాశం ఉంది.













