అసెంబ్లీకి ఆ ఇద్దరూ డుమ్మా..! క్రాస్ ఓటింగ్ వాళ్ల పనేనా..?
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ ఇద్దరు ఎవరా అని ఆరా తీసే పనిలో వైసీపీ అధిష్టానం బిజీగా ఉంది. ఇప్పటికే పలువురు అనుమానితులను గుర్తించింది. అయితే అందరి చూపూ ఇద్దరి పైన ఉంది. వాళ్లే మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. నిన్న టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలిచిన వెంటనే వీళ్లిద్దరి పైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇవాళ అసెంబ్లీకి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి డుమ్మా కొట్టడంతో వీళ్లిద్దరి పైన అనుమానాలు మరింత బలపడ్డాయి. నిన్న ఓటింగ్ అనంతరం స్పందించిన ఉండవల్లి శ్రీదేవి.. తాను వైసీపీ అభ్యర్థికే ఓటేశానని స్పష్టం చేశారు. దళిత మహిళను కాబట్టి తనను అనుమానిస్తున్నారని.. తాను ఉదయం కుమార్తెతో కలిసి సీఎం జగన్ ను కూడా కలిశానని గుర్తు చేశారు. తనకిచ్చిన కోడ్ ప్రకారమే ఓటేశానని.. రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాబట్టి తనను అనుమానిస్తున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. విలువలే ముఖ్యమని తేల్చేశారు.
మరోవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిన్న ఓటు వేసిన తర్వాత కనిపించకుండా వెళ్లిపోయారు. ఇవాళ కూడా ఆయన అసెంబ్లీకి రాలేదు. ఓటింగ్ అనంతరం ఆయన బెంగళూరు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తుండడంతో వైసీపీ వాళ్ల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కొంతకాలంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన పనులేవీ జరగట్లేదు. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లీనా.. చూస్తా.. చేస్తా అని చెప్తున్నారే కాని అవి అమలు కావట్లేదు. దీంతో మేకపాటి క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉంటారని సమాచారం.
ఎంతో పగడ్బందీగా ఏడుగురు అభ్యర్థులను గెలిపించుకునేందుకు వైసీపీ స్కెచ్ వేసింది. అయినా ఒక సీటులో ఓడిపోవడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. రహస్య ఓటింగ్ కావడంతో ఎవరు ఈ పని చేశారో గుర్తించే అవకాశం అధికారికంగా లేదు. అనుమానించడం తప్ప చేయగలిగిందేమీ లేదు. కాబట్టి ఎవరి పైన చర్యలు తీసుకోవాలో తెలీదు. దీంతో అయోమయంలో తర్జనభర్జన పడుతోంది వైసీపీ హైకమాండ్.













