మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎస్ఈసీని కించపరిచేలా కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారని నోటీసులో పేర్కొన్నారు. కమిషన్ ప్రతిష్ఠను దిగజార్చేలా దురుద్దేశ ప్రకటనలు ఉన్నాయి. మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలి. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు బహిరంగ ప్రకటన చేయాలి. మంత్రి కొడాలి నాని స్వయంగా లేదా ప్రతినిధి ద్వారా సమాధానం ఇవ్వాలని అని ఎస్ఈసీ ఆదేశించారు.
తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పినట్టు ఎస్ఈసీ రమేశ్ కుమార్ నడుచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ, చంద్రబాబు వేర్వేరు అని తాము అనుకోవట్లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి. ఎలా నిర్వహించాలనేది పార్క్ హయత్‌లో సమావేశమై నిర్ణయించారని ఆరోపించారు. కొడాలి నాని మీడియా సమావేశం పుటేజ్ పరిశీలించాక ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు.













