రాజధానిపై మరోసారి స్టేటస్ కో
రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని త్రిసభ్య ధర్మాసనం సృష్టం చేసింది. రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు ఇవాళ్టితో ముగిశాయి. దీంతో సెప్టెంబరు 21 వరకు స్టేటస్ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్ కో కొనసాగుతుందని ధర్మాసనం సృష్టం చేసింది. కౌంటరు దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబర్ 11 వరకు గడువు ఇచ్చింది. అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు గడువు ఇస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మొత్తం 70 పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.













