AP Govt: ఇంటర్ పరీక్షల పై ఏపీ ప్రభుత్వం కొత్త ప్రయోగం.. రెండేళ్లకు కలిపి పబ్లిక్ పరీక్ష ఒకేసారి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యావిధానంలో (Ap inter exams) సమూల మార్పులు చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందుకోసం విద్యాశాఖ మంత్రి (Education Minister) నారా లోకేశ్ (Nara Lokesh) నేతృత్వంలో సంస్కరణలు ప్రకటించబడ్డాయి. ప్రస్తుతం ఉన్న ఇంటర్ సిలబస్‌ను పున:సమీక్షించనుండగా, కొత్త సిలబస్‌తో పాటు పరీక్ష విధానంలోను మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పులను అమలు చేయడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు కోరుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నెల 26 వరకు సూచనలు స్వీకరించబడతాయి.
ప్రస్తుతం విద్యావిధానం చాలా కాలం నుంచి ఏటువంటి మార్పులు లేకుండా అలగానే కొనసాగుతుంది. ఫలితంగా, పాత పాఠ్యాంశాలను బోధిస్తూ ఉన్నారు. ఈ పరిణామం వల్ల రాష్ట్ర విద్యార్థులు దేశవ్యాప్తంగా జరుగుతున్న పోటీ పరీక్షల్లో తగిన ప్రతిభ కనబర్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో,( NCERT) ఎన్సీఈఆర్టీ ఆధారిత సిలబస్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయవచ్చు. కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి సంబంధించి అధ్యాపకులతో కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కమిటీలు 14 సబ్జెక్టులపై సిలబస్‌లో చేయాల్సిన మార్పులపై సూచనలు ఇస్తాయి.
2025-26 విద్యా సంవత్సరం నుండి కొత్త పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరీక్ష విధానంలో కూడా అనేక మార్పులు ఉండనున్నాయి. ప్రస్తుతం ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులకు 100 మార్కుల పరీక్షలు నిర్వహించబడుతున్నా, ఇకపై 80 మార్కుల పరీక్షలు నిర్వహించి, 20 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ (పరిశోధన, ప్రాజెక్టులు) ద్వారా కేటాయించనున్నారు. MPC, BiPC గ్రూపులకు సంబంధించి కూడా మరిన్ని మార్పులు ప్రకటించబడ్డాయి.
ప్రతి గ్రూపుకు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్స్, ప్రాజెక్టుల కోసం మార్కుల కేటాయింపులు చేయబడతాయి. ముఖ్యంగా, మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసి, రెండేళ్ల పబ్లిక్ పరీక్షను ఒకేసారి నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక, MBiPC కోర్సును కొత్తగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఈ కోర్సు ద్వారా ఇంజనీరింగ్, వైద్య రంగాలలో ప్రవేశించేందుకు అర్హత పొందవచ్చు. ఇక, MPC, BiPC, CEC, HEC, MEC కోర్సులతోపాటు 26 కొత్త కాంబినేషన్లు ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ మార్పులు విద్యావేత్తలు, విద్యార్థులు, మరియు ఇతర సంబంధిత వర్గాలను ప్రభావితం చేస్తాయి.













