ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముందడుగు
ఆంధప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన పక్రియ కోసం అవసరమైన వ్యవస్థలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీకి సహకరించేందుకు సచివాలయం, నాలుగు ఉపసంఘాలు, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్ఎస్ఎస్) సీఈవోను రాష్ట్ర స్థాయి కమిటీ సచివాలయానికి డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సచివాలయ ఏర్పాటు బాధ్యతలను ఆర్థిక శాఖకు అప్పగించింది. ఖజానా శాఖ, వర్కస్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ డైరెక్టర్లను దీనిలో సభ్యులుగా నియమించింది. నాలుగు ఉపసంఘాలను, జిల్లా స్థాయి కమిటీలనూ ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘాల్లో ఆర్థిక శాఖ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సభ్యులుగా ఎవరుండాలో వాటి చైర్మన్లే ఎంపిక చేసుకోవచ్చు.













