ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలను విదేశాంగశాఖ ఏపీ ప్రభుత్వం అందించింది. ప్రత్యేకించి రొమేనియా, హంగరీ సరిహద్దులకు వెళ్లి విద్యార్థులను త్వరితగతిన స్వదేశానికి తీసుకువచ్చే అంశంపై ఈ బృందం విదేశాంగశాఖకు సహకారం అందించనున్నట్టు సమాచారం.
మరో వైపు ఇప్పటి వరకు ఉక్రెయిన్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న 680 మంది విద్యార్థుల వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశాంగ శాఖకు అందించింది. భారత్లోని ఉక్రెయిన్ ఎంబసీతో పాటు ఐబీ స్టాంపింగ్ కార్యాలయం, వివిధ ప్రైవేటు ఏజన్సీల ద్వారా ఈ వివరాలను సేకరించి జాబితాను రూపొందించారు. మరోవైపు దొరికిన సమాచారం ఆధారంగా రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు విద్యార్థు ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు.













