ఈ నెలాఖరు వరకు మిర్చి, పసుపు కొనుగోళ్ళు: ముఖ్యమంత్రి
పౌరసరఫరాలు, మార్క్ ఫెడ్, గిడ్డంగుల శాఖలు సమన్వయం చేసుకుంటూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మిర్చి, పసుపు కొనుగోళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగించడంతో పాటు, కల్పిస్తున్న అదనపు గిట్టుబాటు ధర సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కెటింగ్ శాఖ పై సమీక్ష నిర్వహించి పసుపు, మిర్చి కొనుగోళ్లను స్వయంగా సమీక్షించారు.
రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు మాత్రమే అదనపు ధర చెల్లించడం సరికాదని రైతులకు ఎల్లప్పుడూ గిట్టుబాటు ధర లభించేలా శాశ్వత కార్యాచరణ రూపొందించి నిరంతర ప్రక్రియలా కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 1,74,474 క్వింటాళ్ళు, మిర్చి కొనుగోలు కేంద్రాల ద్వారా 4,77,425 క్వింటాళ్ళు కొనుగోలు జరిగాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పసుపుకు రూ.110 కోట్లు, మిర్చికి రూ.71 కోట్లు వ్యయం చేశామని చెప్పారు. వ్యవసాయ మార్కెటింగ్ లో అధునాతన పోకడలను అందిపుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి అన్నారు. పౌరసరఫరాలు, మార్క్ ఫెడ్ శాఖలు ప్రొఫెషనల్ గా మారాలన్నారు. మన అవసరాలకు ఉపయోగించుకుని ఎగుమతులు చేసే స్థాయికి ఈ శాఖలు రావాలని చెప్పారు. రాష్ట్రంలోని రైతుల అవసరాల మేరకు తగినన్ని గిడ్డంగులు నిర్మించాలని అన్నారు.
కోల్డ్ స్టోరేజ్ చైన్ లింక్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దని, రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చేయడంలో రాజిపడబోనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతు పండించిన కూరగాయలు,ఇతరత్రాలు నేరుగా ప్రజల ఇళ్లకే వెళ్లి అందిచేలా రైతు బజార్లను పటిష్టం చేయాలని ఆదేశించారు. రైతు కు లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.













