ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం
తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఈనెల 17న జరగనున్న నీతి అయోగ్ సమావేశం, ఏపీకి జరిగిన అన్యాయం, కుట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి భేటీ కావడం రెండు పార్టీల కుట్రలకు పరాకాష్ట అని విమర్శించారు. పీఎంవోలో విజయసాయిరెడ్డి తిష్ట వేయడంపై గతంలో ఫొటోలు వచ్చాయని, ఇప్పుడు ఢిల్లీలో బుగ్గన, ఆకులతో కలిసివెళ్లడంపై వీడియోలు వచ్చాయన్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అడగకుండానే వైసీపీ బేషరతుగా మద్దతిచ్చిందని విమర్శించారు.
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీని జగన్ ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు పార్టీల కుట్ర రాజకీయాలకు ఇంతకన్నా రుజువులు ఏం కావాలని అన్నారు. జేబీపీ, వైసీపీ, కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఎంపీలు వారానికి ఒక కార్యక్రమం అన్ని జిల్లాలలో చేపట్టాలన్నారు. విభజన చట్టంలోని అంశాలు, హామీలు అమలుపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. బీజేపీ నమ్మకద్రోహంపై ప్రజలను చైతన్యపరచాలని, బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలను ఎండగట్టాలని సూచించారు.













