2022 జూన్ మా టార్గెట్… పోలవరానికి సహకరించండి : సీఎం జగన్

పోలవరాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే తన ఢిల్లీ పర్యటనలోనూ పోలవరం ప్రాజెక్టు విషయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ మొదట కేంద్ర జలశక్తి వనరుల మంత్రి గజేందర్ సింగ్ సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కేంద్ర మంత్రితో పోలవరంపైనే విస్తృతంగా చర్చించారు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో ఏం చేస్తుందన్న విషయాన్ని కేంద్ర మంత్రికి సోదాహరణంగా జగన్ వివరించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్ట్, పునరావాస పనులను 2022 జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, అందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
అంతేకాకుండా ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని కూడా కోరారు. ఇప్పటికే తాము రాష్ట్ర ప్రభుత్వ వ్యయం నుంచి ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్నామని, జాప్యం లేకుండా నిధులను రియంబర్స్ చేయాలని పేర్కొన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని కూడా సీఎం జగన్ కోరారు. దీంతో పాటు జాతీయ ప్రాజెక్టుల విషయంలో నీటి సరఫరాని ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా చూడాలని కూడా సీఎం జగన్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.