రాత్రంతా చంద్రబాబును విచారించనున్న సిట్..!?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ.. తదుపరి ఏం చేస్తుందనేది అత్యంత ఉత్కంఠ కలిగిస్తోంది. ఆయన్ను కస్టడీకి తీసుకుంటుందా.. లేకుంటే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తుందా.. అని ఉదయం నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎలా.. ట్విస్టులు ఉంటేనే కదా బాగుండేది. ఇప్పుడు అదే జరుగుతోంది. చంద్రబాబును సీఐడీ అంత ఈజీగా వదలట్లేదు. ఈ కేసులో మరిన్ని మలుపులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఉదయం నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకోగానే ఆయన్ను విజయవాడ తరలించింది సీఐడీ. ఆయన విజయవాడ చేరుకునే సరికి సాయంత్రం అయింది. నేరుగా ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరు పెడతారని అందరూ అనుకున్నారు. కానీ అలా చేయలేదు. నేరుగా ఆయన్ను సీఐడీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ చంద్రబాబును విచారించడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి విచారిస్తూనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా చంద్రబాబుకు 20 ప్రశ్నలతో కూడిన పేపర్ ఇచ్చారు సీఐడీ అధికారులు. వాటికి సమాధానాలు ఇవ్వాలని కోరారు. అయితే వాటికి సంబంధించి తనకు ఏమీ గుర్తులేదని, తన దగ్గర సమాచారం లేదని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.
మరోవైపు.. చంద్రబాబును కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ చాలాసేపు సిట్ కార్యాలయం ఎదుట వెయిట్ చేశారు. చాలాసేపు లోపలికి పంపలేదు. ఆ తర్వాత పంపించారు. బాలకృష్ణ, బ్రాహ్మణి కూడా చంద్రబాబును చూసేందుకు సిట్ కార్యాలయానికి వచ్చారు. టీడీపీ ఎంపీ కనకమేడల, లాయర్ ను మాత్రం చాలా సేపటి తర్వాత అనుమతించారు. అయితే అసలు సిట్ కార్యాలయంలో ఏం జరుగుతోందో అసలు అర్థం కావట్లేదు. సిట్ కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు భారీగా మోహరించారు. చంద్రబాబును కోర్టులో ఎప్పుడు హాజరు పరుస్తారోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత 24 గంటలలోపు కచ్చితంగా కోర్టులో పెట్టాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల సమయంలో చంద్రబాబును అరెస్టు చేశారు. దీన్ని బట్టి రేపు ఉదయం 6 గంటలలోపు కచ్చితంగా కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఐడీ ప్రయత్నిస్తోంది. రాత్రంతా చంద్రబాబును విచారించి వివరాలు రాబట్టాలని భావిస్తోంది. చంద్రబాబు నుంచి ఏదైనా సమాచారం రాబట్టగలిగితే దాన్ని కోర్టులో ప్రవేశపెట్టాలనుకుంటోంది. మరోవైపు చంద్రబాబును కోర్టులో హాజరు పరిస్తే ఆయన తరపున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ లూథ్రా సిద్ధంగా ఉన్నారు. మరి రాత్రంతా చంద్రబాబు నుంచి సీఐడీ ఏమైనా సమాచారం రాబడుతుందా.. రేపు ఉదయం కోర్టులో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.













