చంద్రబాబు అరెస్టుపై సీఐడీ వర్షన్ ఏంటి..?
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నంద్యాలలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వివరాలను విజయవాడలో సీఐడీ అడిషనల్ డీజీ ఎన్.సంజయ్ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం రూ.550 కోట్ల మేర అవినీతి జరిగిందన్నారు. ఇందులో ప్రధాన నిందితుడిగా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని సంజయ్ వివరించారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.371 కోట్ల మేర నష్టం జరిగిందని.. ఈ లావాదేవీలన్నీ చంద్రబాబుకు తెలిసే జరిగాయని తెలిపారు సంజయ్.
యువతలో స్కిల్ డెవలప్మెంట్ కోసం సీమెన్స్ సంస్థతో అప్పటి ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుందని.. అయితే నకిలీ ఇన్వాయిస్ ల ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని సంజయ్ తెలిపారు. ప్రభుత్వం తరపున ఆదేశాలివ్వడం, సీమెన్స్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోవడం.. నిధులు మళ్లించడం ద్వారా కుంభకోణానికి తెరలేపారన్నారు. అంతేకాక.. ఈ స్కాంలో ప్రధాన పత్రాలు మాయం చేయడం వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందన్నారు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో మరిన్ని వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టోడియల్ విచారణ అవసరమని.. అందుకే ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని సంజయ్ వెల్లడించారు. ఈడీ, జీఎస్టీ అధికారులు కూడా ఈ కేసుపై ఇప్పటికే విచారణ జరుపుతున్నారన్నారు. తమ విచారణలో బయటకు వచ్చిన అంశాలను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ను అరెస్టు చేశామన్నారు. అంతేకాక.. ఆధారాలను ట్యాంపర్ చేసే ప్రమాదం కూడా ఉందన్నారు.
కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని సంజయ్ తెలిపారు. కేవలం స్కాంకోసమే దీన్ని ఏర్పాటు చేశారన్నారు. అంతేకాక.. గంటా సుబ్బారావును కార్పొరేషన్ ఛైర్మన్ తో పాటు మరో నాలుగు పదవుల్లో నియమించారనన్నారు. ఇది కూడా చట్టవిరుద్ధమని వివరించారు. స్కిల్ కార్పొరేషన్ తో సీమెన్స్ ఒప్పందం కుదిర్చిన డిజైన్ టెక్ కు చెందిన జి.వి.ఎస్.భాస్కర్ అనే వ్యక్తి, ఆయన భార్య ఐఏఎస్ అధికారి అపర్ణను కార్పొరేషన్ డిప్యూటీ సీఈఓగా నియమించారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుతో పాటు లోకేశ్ ను కూడా విచారించాల్సిన అవసరం వస్తుందన్నారు సంజయ్. సాధారణంగా ఆర్థిక కుట్రకు పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.













