ఏపీలో ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు ఎంతో వ్యూహాత్మకంగా తన ప్రణాళికలను పాటిస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ ఐదు సంవత్సరాల చీకటి పాలన నేపథ్యంలో ఎన్నో అవకతవకలను వెలికి తీసి ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ భేటీ ముగియడంతో రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
ఈ సమావేశంలో మంత్రులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యల తో పాటు వాటిని ఎలా నివారించాలి అనే విషయాలపై కూడా చర్చలు జరిగాయి. ఇక మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాలు ఏమిటో తెలుసుకుందాం..
ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
బాబు ప్రకటించినట్లుగా కొత్త ఇసుక విధానానికి క్యాబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
అందరినీ భయపెడుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కూడా క్యాబినెట్ తమ ఆమోదాన్ని తెలిపింది.
పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి ప్రభుత్వ గ్యారెంటీ విషయంపై కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది..
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం కోసం ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మంత్రులు అచ్చెం నాయుడు, అనగాని, నాదెండ్ల మనోహర్ సభ్యులుగా పంటల భీమ పథకానికి సంబంధించిన ప్రీమియం చెల్లింపుల విధివిధానాల ఖరారు కమిటీ వేయాలని క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయించారు. అంతేకాదు రెండు రోజులలో నివేదిక ఇవ్వవలసిందిగా క్యాబినెట్ ఈ ముగ్గురు మంత్రులను కోరింది. ఈ రెండు రోజులలో అధికారులతో మాట్లాడి ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా.. లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశంపై ఈ ముగ్గురు ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తారు.













