రైతన్నకు తోడుగా ‘ఏపీ ఆగ్రోస్’
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ ఆగ్రోస్) బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, పురుగు మందులను సరఫరా చేస్తున్న ఏపీ ఆగ్రోస్‌ను వ్యవసాయ యాంత్రీకరణలో భాగస్వామిగా చేయనున్నారు. ఏపీ ఆగ్రోస్‌ను బలమైన ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా రూ.2,133.75 కోట్లతో 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ), నియోజకవర్గ స్థాయిలో అత్యాధునిక యంత్ర పరికరాలతో 175 హైటెక్ హబ్‌లు, వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి ఐదు చొప్పున కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో 1,035 సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్బీకేల స్థాయిలో ఐదుగురు కంటే ఎక్కువ మందితో ఏర్పాటైన ఎంపిక చేసిన రైతు సంఘాలకు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు, కంబైన్డ్ హార్వెస్టర్స్ తదితర పరికరాలను రాయితీపై సమకూరుస్తున్నారు.













