స్థానిక ఎన్నికలపై డెడ్ లైన్ విధించిన హైకోర్టు
స్థానిక ఎన్నికల పక్రియపై ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో ప్రభుత్వం చర్చించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు అందిన మూడు రోజుల్లో ముగ్గురు అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపించాలని నిర్దేశించింది. ఇందుకోసం ఎన్నికల కమిషనే వేదికను నిర్ణయించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ భేటీలో ఎన్నికల నిర్వహణపై ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వ అధికారులు ఎస్ఈసీ ముందుంచాలని హైకోర్టు సృష్టం చేసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిన అవశ్యకతను ఎస్ఈసీ వివరించాలని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.













