కేసీఆర్‌కు బాబు మరో ఝలక్: సింగరేణిలో వాటా అడిగిన ఏపీ, అందుకే…
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఏపీకి వాటా ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు..
ఒక రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు చట్టబద్ధమైన సంస్థల ఆస్తులు, అప్పులను రెండు రాష్ట్రాల మధ్య న్యాయబద్ధంగా పంపిణీ చేయాలని, ఇరు రాష్ట్రాల్లోని ప్రజల సంక్షేమానికి భరోసా ఇవ్వాలని, ఈ మేరకు ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సింగరేణి గనుల్లో ఏపీకి వాటా ఇవ్వాలని సీఎస్ తన లేఖలో కోరారు.
విజయవాడ కేంద్రంగా…
భారతీయ కంపెనీల చట్టం కింద నమోదైన సింగరేణి సంస్థ ఏపీతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలు, ఉమ్మడి ఏపీ అంతటా మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిందని, ఏపీలో పెట్టుబడులు పెట్టిందని, సింగరేణి అనుబంధ సంస్థ ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ కంపెనీ విజయవాడ కేంద్రంగా పని చేస్తోందని, ఈ నేపథ్యంలో సింగరేణి కంపెనీని అంతర్రాష్ట్ర సంస్థగా పరిగణించి దాని ఆస్తులు, అప్పులు, ఈక్విటీని విభజన చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం జనాభా నిష్పత్తి (58.32:41.68)లో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కోరారు.
ఏపీ ఆమోదం తీసుకోలేదని..
విభజన చట్టంలోని సెక్షన్ 92 మౌలిక వసతులు, ప్రత్యేక ఆర్థిక చర్యల (స్పెషల్ ఎకనమిక్ మెజర్స్) గురించి చెబుతోందని, ఈ సెక్షన్‌కు షెడ్యూల్ 12ని జత చేశారని, ఈ షెడ్యూల్ మేరకు గతంలో ఏపీ వద్ద ఉన్న 51% ఈక్విటీని తెలంగాణకు ఇచ్చారని, 49% కేంద్ర ప్రభుత్వానికి కట్టపెట్టారని, సంస్థ ఈక్విటీని తెలంగాణకు బదిలీ చేయడానికి ఏపీ ఆమోదం తీసుకోలేదని, ఎలాంటి పరిహారం చెల్లించకుండా 51% వాటాను ఏకపక్షంగా బదిలీచేయడం భారతీయ కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీలో పెట్టుబడి
ఇదే షెడ్యూల్లో సింగరేణి గనులకు అప్పటికే ఉన్న కోల్ లింకేజీలను ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించాలని చెప్పారని, విభజనకు ముందే ఏపీ, తెలంగాణల్లోని విద్యుత్తు సంస్థలకు సింగరేణి కాలరీస్ బొగ్గు సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ సింగరేణిలో రూ.886 కోట్ల మేర పెట్టుబడి పెట్టిందన్నారు.













