ఏపీకి భారీగా కోవిషీల్డ్ డోసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పడుతోంది. అయినా అక్కడి ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది. 104 కాల్ సెంటర్‌ను మరింత పటిష్ఠం చేస్తోంది. ఏపీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, తగు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వీటన్నింటితో పాటు వ్యాక్సిన్ డోసులు, వ్యాక్సినేషన్ విషయంలోనూ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. అధికారులు వ్యాక్సిన్ విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి భారీగా కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. దాదాపు 9 లక్షల డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. గన్నవరంలో ఉన్న టీకా నిల్వల కేంద్రానికి అధికారులు వీటిని తరలించారు. కోవిడ్ పూర్తిగా పోతోందన్న అభిప్రాయంతో అధికారులెవ్వరూ ఉండకూడదని, ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ, తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిందేనని సీఎం జగన్ సూచించారు. థర్డ్ వేవ్ వస్తుందో లేదో తెలియదని, అయినా అధికారులు నిరంతర అప్రమత్తతతో ఉండాలని, వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు.