Current Charges: ఏపీలో కరెంటు ఛార్జీల తగ్గింపు..! క్రెడిట్ ఎవరిది..?

ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లులు (current bill) తగ్గుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు (electricity charges) అధికంగా వసూలు చేస్తున్నారంటే వినియోగదారుల (customers) నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపత్యంలో తగ్గబోతున్నాయనే వార్త వారిలో సంతోషం కలిగిస్తోంది. అయితే ఈ తగ్గింపు ఛార్జీల వెనుక ఎంతో మతలబు ఉంది. ఇప్పటికే వినియోగదారుల నుంచి అధికంగా వసూలు చేసిన ఛార్జీలను మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు తెరిగి చెల్లిస్తోంది. అంతేకానీ ప్రభుత్వం అదనపు తగ్గింపు ఏదీ ఇవ్వట్లేదు. వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన ఛార్జీలను తగ్గిస్తూ.. ఇది తమ ఘనతేనని చెప్పుకుంటోంది కూటమి ప్రభుత్వం. అయితే వైసీపీ మాత్రం కూటమి పోకడలను తప్పుబడుతోంది.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా విద్యుత్ నియంత్రణ మండలి పర్యవేక్షిస్తుంది. ఛార్జీల పెంపు, తగ్గుదల కూడా దాని పరిధిలోనే ఉంటుంది. అయితే రెగ్యులేటరీ కమిషన్ (regulatory commission) నిబంధనలను అతిక్రమించి అధికంగా ఖర్చు అవుతుందేమోనని భావించి డిస్కంలు అధిక ఛార్జీలు వసూలు చేశాయి. ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్ ఈ ఛార్జీలను తిరిగి వినియోగదారులకు చెల్లించేయాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తిరిగి చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీ విద్యుత్ నియంత్రణ సంఘం (APERC) ఆదేశాల మేరకు నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ప్రతి యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటించారు.
2024 – 2025 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలపై APERC సమీక్ష నిర్వహించింది. ఇందులో డిస్కంలు విద్యుత్ కొనుగోళ్ల పేరుతో ప్రతి యూనిట్ కు 40 పైసల చొప్పున రూ.2,787.18 కోట్లు అధికంగా వసూలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. అయితే రూ.1,863.64 కోట్లు మాత్రమే ఖర్చయింది. దీంతో మిగిలిన రూ.923.55 కోట్లను తిరిగి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. అందులో భాగంగా నవంబర్ నుంచి ప్రతి నెలా బిల్లులో యూనిట్ కు 13పైసల చొప్పున ఛార్జీ తగ్గిస్తారు.
విద్యుత్ ఛార్జీల తగ్గింపును కూటమి ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటోంది. చంద్రబాబు అనుభవం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. అయితే వినియోగదారుల నుంచి కూటమి ప్రభుత్వం అధికంగా వసూలు చేసిందని, ఇప్పుడు కమిషన్ తప్పుబట్టడంతో దిగి వచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇది చంద్రబాబు ఘనత కాదని చెప్తోంది. వాస్తవం ఏంటంటే ఇలా ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభమైంది వైసీపీ హయాంలోనే. 2024 ఏప్రిల్ నుంచి ప్రతి యూనిట్ కు 40 పైసల చొప్పున ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసింది. అప్పడు అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. జూన్ లో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పాలసీని కంటిన్యూ చేసింది. కాబట్టి ట్రూ అప్ ఛార్జీల వసూలులో వైసీపీ పాత్ర కూడా ఉంది.