కొత్త జిల్లాల్లో అదే రోజు నుంచి పరిపాలన : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అదే రోజు అక్కడి నుంచి పరిపాలన, కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు కొనసాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కొత్త జిల్లా ఏర్పాటుపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సూచించారు. పరిపాలన సాఫీగా సాగేలా వారి అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు.
కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల ప్రాధాన్యతలను అధికారులు వివరించారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు, నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ల విభజన విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని పరిశీలించి తగిన ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.