ప్రభాస్ ఫ్యామిలీపై కన్నేసిన వైసీపీ!
ఎన్నికలు సమీపిస్తుండడంతో బరిలో నిలబడే సత్తా కలిగిన అభ్యర్థుల కోసం అన్ని పార్టీలూ కసరత్తులు చేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా బేరీజు వేసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది.. వాళ్లను ఎదుర్కోవాలంటే ఎలాంటి వాళ్లను పోటీ చేయించాలి.. లాంటి అనేక అంశాలపై ఆరా తీస్తున్నాయి. అలా బేరీజు వేస్తున్న క్రమంలో నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి ప్రభాస్ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని అధికార వైసీపీ భావిస్తోంది. రఘురామ కృష్ణంరాజు ఇక్కడ వైసీపీ నుంచి గెలిచి ప్లేటు ఫిరాయించారు. ఈసారి ఆయన టీడీపీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన్ను ఎదుర్కోవాలంటే సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలనుకుంటోంది వైసీపీ.
2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నుంచి రఘురామ కృష్ణంరాజు వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే గెలిచిన కొన్ని నెలల్లోనే ఆయన ఆ పార్టీతో విభేదించారు. పార్టీలో కొనసాగుతున్నా.. పార్టీకి వ్యతిరేకంగా నిత్యం గళం విప్పుతున్నారు. అటు బీజేపీతో, ఇటు టీడీపీతో సఖ్యతగా ఉంటున్నారు. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయనపై నియంత్రణ కోల్పోతామని గ్రహించిన వైసీపీ .. ఆయనపై వేటు వేయకుండా అలాగే ఉంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను కోరింది. అయితే ఆయనపై చర్యలు తీసుకునేందుకు అవకాశాలు కనిపించట్లేదు. దీంతో వైసీపీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇక్కడ సరైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తోంది.
నర్సాపురం పార్లమెంటు పరిధిలో క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువ. క్షత్రియ లేదా కాపులకు మాత్రమే టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి ఉంటుంది. అందుకే రఘురామ కృష్ణం రాజుపై పోటీ చేయాల్సిందిగా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని అభ్యర్థించింది వైసీపీ. ఆ పార్టీ ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల సమన్వయ కర్త మిథున్ రెడ్డి.. ఆమెను కలిసి ఈ మేరకు చర్చలు జరిపారు. అయితే ఆమె రాజకీయాల పట్ల సుముఖంగా లేరని సమాచారం. అయినా ఆమెను ఎలాగైన పార్టీలోకి తీసుకొచ్చి బరిలోకి దింపాలని కోరుకుంటోంది వైసీపీ. గతంలో ఇక్కడి నుంచి బీజేపీ తరపున కృష్ణంరాజు పోటీ చేసి గెలిచారు. కేంద్రంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆ చరిష్మా ఇప్పుడు కూడా పని చేస్తుందని వైసీపీ భావిస్తోంది.
కృష్ణం రాజు చనిపోయినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆయన స్మారకార్థం పార్క్ ఏర్పాటు చేసేందుకు బీచ్ లో ఐదెకరాల స్థలం కేటాయించింది. ఒకవైపు కృష్ణంరాజు చరిష్మా.. మరోవైపు ప్రభాస్ ప్రభావం కచ్చితంగా శ్యామలా దేవిని గెలిపిస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే ఆమెను పోటీ చేయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఆమె పోటీపీ ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ పోటీ చేస్తే కృష్ణంరాజు రాజకీయ ప్రస్తానాన్ని ఆమె కొనసాగించినట్లు అవుతుంది. మరి చూడాలి ఆమె పోటీ చేస్తారా.. లేదా అనేది!













