అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అవుతారని అన్ని సర్వేలు స్పష్టం చెబుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ జీవితకాలం అధికారంలో ఉండదని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రం, ప్రజాస్వామ్యం కోసం తెలుగుదేశం పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని అన్నారు. వైసీపీ మాదిరిగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదనే విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను సీఎం పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ చర్యలకు టీడీపీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఒకప్పుడు సీఐడీ అంటే ముఖ్యమైన కేసులను దర్యాప్తు చేసే సంస్థ అని భావించేవాళ్లమని, కానీ ఇప్పుడు భార్యభర్తలు గొడవ పడితే కూడా సీఐడీ అంటున్నారని ఎద్దేవా చేశారు. సీఐబీ పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఆక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.











































































