AP Politics: ద్విపక్ష పోరాటాల మధ్య మూడవ వేదికా? ఏపీలో కొత్త రాజకీయ ప్రయోగాలపై ఆసక్తి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల గురించి రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయి. వాటిలో సీనియర్ పార్టీగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కొనసాగుతుండగా, రెండో స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఉంది. ఇక 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ (Jana Sena Party) కూడా అధికార కూటమిలో భాగంగా మూడవ ప్రాంతీయ శక్తిగా నిలిచింది. జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) ఉన్నప్పటికీ, వాటిలో బీజేపీ మాత్రమే కూటమి రాజకీయాలతో ప్రభావం చూపుతోంది. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నా, పెద్దగా రాజకీయ ప్రభావం చూపించలేకపోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఏపీలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉందా అనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త పార్టీలు ఏర్పడినా, వాటిని ఆదరించే రాజకీయ ఖాళీ నిజంగా ఉందా అనే చర్చ కూడా కొనసాగుతోంది. గత నాలుగు నుంచి ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, ఏపీలో ఎక్కువగా రెండు పార్టీల మధ్యే పోటీ నడుస్తూ వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party)–టీడీపీ మధ్య పోరు ఎన్నో ఏళ్లపాటు కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత అదే పోరు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. జనసేన మూడవ పార్టీగా రంగప్రవేశం చేసినా, కావాల్సినంత రాజకీయ స్థలం లేదని భావించి కూటమిలో భాగమై అధికారంలో కొనసాగుతోందన్న అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రాజకీయ ప్రయోగాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.
పార్టీ పెట్టడం సులువే అయినా, దానికి సరైన స్పేస్ ఉందా లేదా అన్నది ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. బీసీలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, కాపులు కలిసి ఒక బలమైన రాజకీయ వేదిక ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యల తర్వాత రంగానాడు పేరుతో విశాఖపట్నంలో (Visakhapatnam) వంగవీటి రంగా (Vangaveeti Ranga) వర్ధంతి సందర్భంగా నిర్వహించిన భారీ సభ మరింత చర్చకు కారణమైంది.
ఈ సభకు రంగా కుమార్తె ఆశాకిరణ్ (Asha Kiran) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి స్పష్టంగా చెప్పకపోయినా, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రంగా ఆశయాల కోసం పోరాడతానని ప్రకటించారు. ఆమె తన ప్రసంగంలో టీడీపీ, జనసేన, వైసీపీపై విమర్శలు చేయడంతో, ఆమె భవిష్యత్ రాజకీయ అడుగులపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆమె వైసీపీలో చేరుతారన్న వార్తలపై ఈ ప్రసంగం ఒక రకమైన సమాధానంగా మారింది.
ఇదే సభకు నిర్వహణ బాధ్యతలు తీసుకున్న రాధా రంగా మిత్రమండలి (Radha Ranga Mitra Mandali) నేతలు, తాము ఏపీలో ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తామని ప్రకటించడంతో కొత్త చర్చకు దారి తెరచింది. రాజకీయ శక్తి అంటే పార్టీనేనా? రంగానాడు ఒక రాజకీయ వేదికగా మారుతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ వస్తే అదే పేరుతో ఏర్పడుతుందా అనే చర్చ కూడా సాగుతోంది.
ఈ సభలో పాల్గొన్న తెలంగాణకు చెందిన బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) కూడా బీసీలు, బడుగులు, కాపులు కలసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీంతో బహుజన వర్గాల కోసం ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పడుతుందా అన్న ఆసక్తి పెరిగింది. ఆశాకిరణ్ రాష్ట్ర పర్యటన పూర్తయ్యాక ఆమె ప్రసంగాలు, ఆలోచనలు చూసిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.






