ఢిల్లీలో హై అలర్ట్
దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే ఇ మొహమ్మద్ దాడులకు కుట్ర చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇటీవల అరెస్టు అయిన జేషే ఉగ్రవాదులు సయిద్ మునీర్ ఉల్ హసన్ ఖ్వాద్రీ, ఆషిక్ బాబా, తారిక్ అహ్మద్ దార్లు.. దాడులకు సంబంధించిన అంశాలను దర్యాప్తులో వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. 2016లో జరిగిన నగ్రోటా ఆర్మీ క్యాంపు దాడి ఘటనలో ఈ ముగ్గుర్నీ అరెస్టు చేశారు. కశ్మీర్ యువతకు శిక్షణ ఇచ్చి, వాళ్లనే ఏజెంట్లుగా జేఈఎం పంపిస్తున్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. బుర్హన్ వానీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది. జనం రద్దీగా ఉండే ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి.













