సోషల్ మీడియాకు ఈసీ కళ్లెం
రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మార్చే సంస్థల నియంత్రణ
-ఓ విధానాన్ని రూపొందిస్తున్నట్టు వెల్లడించిన ఎలక్షన్ కమిషనర్ రావత్
రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు కొన్ని పౌర సంబంధాల సంస్థల సహాయం తీసుకుంటున్నట్టు ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకుగాను త్వరలోనే సామాజిక మాధ్యమాలకు కళ్లెం వేసే విధానాన్ని రూపొందించనున్నది. పౌర సంబంధాల సంస్థల ఆధ్వర్యంలో పనిచేసే కొందరు ఆపరేటర్లు డబ్బులు తీసుకొని ఆన్లైన్లో ప్రజాభిప్రాయాన్ని కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ పేర్కొన్నారు. మొబైల్ ఇంటర్నెట్ పరిజ్ఞానం విస్తరణతో సామాజిక మాధ్యమాల ప్రభావం కూడా పెరిగిందన్నారు. దీంతో సామాజిక మాధ్యమాలను కూడా మీడియాగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని, వాటిలో వచ్చే అంశాలను పరిశీలించాల్సి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ఒక విధానాన్ని రూపొందిస్తున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని ఆయన అన్నారు. ఎన్నికలు, రాజకీయ సంస్కరణలు అంశంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఢిల్లీలో నిర్వహించిన సంప్రదింపుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ వర్గాలు నైతిక విలువలకు తిలోదకాలిచ్చి గెలువడమే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా జరిగినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకోవడాన్ని తెలివైన రాజకీయంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. తమ మాట వినని వారిని ప్రలోభపెట్టేందుకు లేదా బెదిరించేందుకు ధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వ్యూహాత్మకంగా ప్రయోగిస్తున్నారని రావత్ చెప్పారు. గుజరాత్లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నేటి నయా రాజకీయ విధానంలో ఎన్ని ఎత్తులైనా వేసి గెలుస్తే చాలు.. విజేతగా నిలిచిన వ్యక్తికి ఏ పాపం అంటదు. అధికార పక్షంవైపు పార్టీ ఫిరాయిస్తే అంతకుముందు ఎన్ని తప్పులు, నేరాలు చేసినా స్వచ్ఛమైనవారుగా మారుతారు అని రావత్ వ్యాఖ్యానించారు. రాజకీయ నైతిక విలువలకు ఇది కొత్త నిర్వచనంగా మారుతున్నదని అన్నారు. ఈ విపరిణామాలను అరికట్టేందుకు, మెరుగైన ఎన్నికల వ్యవస్థ, ఉత్తమ భవిష్యత్ కోసం అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, మీడియా, పౌర సమాజం, రాజ్యాంగ అధికారులు, ప్రజాస్వామ్యంపై విశ్వాసమున్న వారందరూ ముందుకు రావాలని చెప్పారు.













