తీవ్ర పరిణామాలుంటాయి : అమిత్ షా
‘ప్రధాన మంత్రి చెప్పినా మీరు వినటం లేదు. విప్ జారీచేసినా సభకు హాజరు కావటం లేదు.. ఇక మీదట ఇలాంటివి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలుంటాయి’ అని రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు గైర్హాజరైన పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎంపీలు, మంత్రులు ఇలాగే వ్యవహరిస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించకపోవచ్చునని షా బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభలో సోమవారం సాయంత్రం బిసి జాతీయ కమిషన్ను ఏర్పాటుకు సంబంధించిన బిల్లు చర్చకు వచ్చినప్పుడు దాదాపు 30 మంది బిజెపి దాని మిత్రపక్షాల సభ్యులు సభలో లేరు. విప్ జారీ చేసిన తరువాత కూడా ఇంతమంది ఎంపీలు సభకు గైర్హాజరు కావటంతో బిల్లు వీగిపోయింది. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందంటూ ఆయన బిజెపి ఎంపీలు, మంత్రులపై మండిపడ్డారు.













