ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డులు
ప్రవాస భారతీయులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చల్లటి కబురు చెప్పారు. భారత పాస్పోర్టు కలిగి ఉన్న ఎన్ఆర్ఐలు తిరిగి స్వదేశానికి రాగానే వారికి ఆధార్ కార్డులు ఇస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆధార్ పొందేందుకు 180 రోజులు వేచిచూడాలనే నిబంధన ఉన్నప్పటికీ, ఆ నిబంధనతో పనిలేకుండానే వారికి ఆధార్ కార్డులు ఇస్తామన్నారు. 2019-20 సంవత్సరానికి లోక్సభలో కేంద్ర బడ్జెట్ సమర్పణ సందర్బంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. భారతదేశానికి ఇంతవరకూ దౌత్య కార్యాలయాలు లేని చోట్ల వాటిని ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఆఫ్రికా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 18 కొత్త దౌత్య కార్యాలయాలు తెరవనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ చర్యతో విదేశాల్లో భారతదేశం మరింత ఉనికిని పెంచుకోవడంతో పాటు, అక్కడి భారతీయులకు మెరుగైన ప్రజాసేవలు అందించే వీలుంటుందని తెలిపారు.













