ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి..?
భారతదేశంలో ఎన్నికల నిర్వహణ అంటే మహాయజ్ఞంలాంటిది. ఈక్రతువు సజావుగా సాగాలంటే అపరిమిత ధనప్రవాహం అవసరం. మరి ఆధనం పార్టీలకు ఎలా చేరుతుంది. తమకు కావాల్సిన నిధులను పార్టీలు ఎలా సమీకరిస్తాయి. పార్టీలు అడిగిన వెంటనే కార్పొరేట్ కంపెనీలు ఎందుకు నిధులు సమర్పించుకుంటాయి. పార్టీలకు విరాళాల రూపంలో నిధులు ఇవ్వడం వల్లే పార్టీలకు లాభమేంటి? అంటే.. తమ వ్యాపార ప్రయోజనాలు, ఇతరత్రా బిల్లుల విషయం వచ్చే సరికి పార్లమెంటులో వాటికి సంబందించిన అంశాలను లేవనెత్తడం, ఓటేయడం లాంటి అంశాలకు సంబంధించి లాబీయింగ్ చేయడానికి ఈపార్టీలను వినియోగించుకుంటాయి.
ప్రామిసరీ నోట్ల తరహాలో..
ఎన్నికల బాండ్లు.. ప్రామిసరీ నోట్లు లాంటివి. ఇవి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లోనే లభ్యం అవుతాయి. భారత పౌరులు, దేశీయ కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తి లేదా సంస్థ వివరాలను ఎస్బీఐ గోప్యంగా ఉంచుతుంది. కేవైసీ వివరాలను తీసుకుంటుంది గానీ.. వాటిని బహిర్గతం చేయదు. తమకు వచ్చిన బాండ్లను 15 రోజుల్లో రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకోవాలి. లేకపోతే ఆ నిధులు.. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి ఖాతాలోకి వెళ్లిపోతాయి. రూ.1000, రూ.10,000, రూ.లక్ష, రూ 10 లక్షలు, రూ.కోటి రూపంలో ఈ బాండ్లు లభిస్తాయి. ఓ వ్యక్తి లేదా సంస్థ ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేయొచ్చు. రాజకీయ పార్టీలు తమకు బాండ్లు ఇచ్చిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను ఎన్నికల కమిషన్‌కు వెల్లడించాల్సిన అవసరం లేదు.
రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకోసం రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017కి సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఎన్నికల బాండ్లపై సుప్రీం వెలువరించిన తీర్పుపై ఎన్నికల సంఘం(ఈసీ) వర్గాలు స్వాగతించాయి. పారదర్శకతకు ఈసీ పెట్టింది పేరని వ్యాఖ్యానించాయి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యవస్థ పారదర్శకంగా ఉండాలన్నదే తొలి నుంచీ ఈసీ అనుసరిస్తున్న విధానమని ఆయన తెలిపారు.













