రష్యా చేతిలో ఉపగ్రహ విధ్వంసక ఆయుధం నిజమేనా..?
ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా ప్రకటించింది. దీన్ని తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. ఆ ఆయుధాన్ని ఇంకా ప్రయోగించలేదని తెలిపింది. ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పులేదని శ్వేతసౌధం ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. ఉపగ్రహ విధ్వంసక ఆయుధానికి సంబంధించిన వ్యవహారాలను బయటపెట్టాలని అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగాన్ని ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ మైక్ టర్నర్ బుధవారం డిమాండ్ చేశారు. దాని పర్యవసానాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆ వార్తల్ని శ్వేతసౌధం ధ్రువీకరించింది.
రష్యా తయారు చేస్తున్న ఉపగ్రహ విధ్వంసక ఆయుధానికి అణ్వస్త్ర సామర్థ్యం ఉందంటూ వచ్చిన వార్తలపై మాత్రం కిర్బీ స్పష్టతనివ్వలేదు. తక్షణమే దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ.. భూ కక్ష్యలోని ఉపగ్రహాలకు ముప్పు పొంచి ఉంటుందని తెలిపారు. దిగువ కక్ష్యలో ఉండే వ్యోమగాములకు సైతం ఇది ప్రమాదకరమన్నారు.
అంతరిక్షం నుంచి భూమిపై దాడి చేసే సామర్థ్యం ఆ ఆయుధానికి ఉందని మాత్రం చెప్పట్లేదని కిర్బీ అన్నారు. అలాగే దీని తయారీని కొన్ని నెలల క్రితమే ప్రారంభించారన్నారు. ఏళ్లుగా దీనిపై పని జరుగుతోందంటూ వస్తున్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. రష్యా తయారు చేస్తున్న ఆయుధానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బైడెన్‌కు తెలియజేశామని చెప్పారు. ఈ సమాచారాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకోవాలని ఆయన ఆదేశించినట్లు వెల్లడించారు.
ఒకవేళ మాస్కో అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఆయుధాన్ని అంతరిక్షంలోకి పంపితే అది చాలా ప్రమాదకరమని అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ స్పేస్ అండ్ డిఫెన్స్ బడ్జెట్ నిపుణుడు టాడ్ హారిసన్ తెలిపారు. భూదిగువ కక్ష్యలో అణ్వస్త్ర ప్రయోగం వల్ల ఉపగ్రహాలన్నీ దెబ్బతింటాయని చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సైతం ప్రభావితమవుతుందన్నారు. దానిలోని వ్యోమగాములకూ ముప్పు తప్పదని వివరించారు. రోదసిలో పూర్తి గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు.













