సెంట్రల్ విస్టాకు మరిన్ని అదనపు హంగులు.. రాజ్‌పథ్ స్థానంలో కర్తవ్య పథ్ నేడే ప్రారంభోత్సవం!
ఢిల్లీ అనగానే మనకు ఇండియా గేట్ గుర్తొస్తుంది. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనం.. లాంటివి చూడకుండా ఎవరూ తిరిగిరారు. రిపబ్లికే డే సమయంలో జరిగే పరేడ్ ఈ ప్రాంతాలను దేశ ప్రజలందరికీ సుపరిచితులను చేసింది. అయితే ఇప్పుడు విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకూ మరింత అదనపు హంగులను జోడించుకున్నాయి. గతంలో రాజ్ పథ్ గా పిలిచిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు కర్తవ్య పథ్ గా నామకరణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని జాతికి అంకితం చేస్తున్నారు.
ఇండియా గేట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ కర్తవ్య పథ్ ను జాతికి అంకితం చేస్తున్నారు. తెలంగాణ గ్రానైట్ తో తయారు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకశిలా విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తున్నారు. గతంలో అధికారానికి చిహ్నంగా ఉన్న ఒకప్పటి రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా మార్చడం ప్రజా సాధికారికతకు ఉదాహరణ అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాన మంత్రి పంచ్ ప్రాణ్ కి అనుగుణంగా వలసవాద మనస్తత్వం గుర్తులను తొలగించడంలో భాగంగా రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చినట్లు పీఎంఓ పేర్కొంది.
పర్యాటకులను ఆకర్షించేందుకు పలు మెరుగైన సౌకర్యాలను జోడించింది ప్రభుత్వం నడక మార్గాలు, పచ్చిక బయళ్లు, పచ్చని లాన్లు, కాల్వల పునరుద్ధరణ, వాటర్ పూల్స్ తో పాటు పలు అదనపు హంగులను జోడించింది. పాదచారులకోసం అండర్ పాస్ లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసింది. అలాగే కొత్తగా ఎగ్జిబిషన్ ప్యానళ్లు, నైట్ లైటింగ్ పెట్టింది. ఈ ప్రాంతమంతటినీ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ పరిధిలోకి తీసుకొచ్చింది. నీటిని రీసైక్లింగ్ చేయడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఎనర్జీ ఎఫెక్టివ్ లైటింగ్ సిస్టమ్.. కర్తవ్య పథ్ లో అదనపు ఆకర్షణలు.
పరాక్రమ్ దివస్ సందర్భంగా జనవరి 23న నేతాజీ హోలోగ్రామ్ ను ప్రధాని ఆవిష్కరించారు. ఇప్పుడు అదే చోట సుభాష్ చంద్రబోస్ గ్రానైట్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ విగ్రహం ఎత్తు 28 అడుగులు. శిల్పి అరుణ్ యోగిరాజ్ నేతాజీ విగ్రహాన్ని చెక్కారు. దీని బరువు 65 మెట్రిక్ టన్నులు.
రాజ్ పథ్ మార్గంలో గతంలో 3లక్షల 50 వేల చదరపు మీటర్ల ఉన్న లాన్ ను ఇప్పుడు మరో 40వేల చదరపు మీటర్లు పెంచారు. దీంతో రిపబ్లిక్ డే సమయాల్లో వినియోగించుకునేందుకు మరింత ఎక్కువ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. అంతేకాక మరింత పచ్చదనాన్ని పెంపొందించింది. 1930లో ఎలా ఉండేదో… అంతటి పచ్చిక ప్రదేశాన్ని తీర్చిదిద్దింది. అంతేకాక సెంట్రల్ విస్టా, రాజ్ పథ్ లో ఉన్న ప్రతి చెట్టుకూ జియోట్యాగింగ్ చేశారు. వాటి ఎత్తు, రకం, పరిమాణం తదితర వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు.
ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని ఆనుకునే కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఇది కూడా పూర్తయితే ఈ ప్రాంతమంతా మరింత సుందరమయం కానుంది.













