ప్రాంతీయ పార్టీలు ఎప్పటికీ కేంద్రానికి గులాములే!

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మూడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు గెలవగా రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీ బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత దేశంలో జాతీయ పార్టీల పనైపోయిందని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గ్రాఫ్ కూడా తగ్గిపోతోందని విశ్లేషణలు వస్తున్నాయి. మోదీ కూడా కరోనాను కట్టడి చేయడంలో విఫలమయ్యారని.. అందుకే ఆయన పాపులారిటీ కూడా తగ్గిపోతోందని చెప్తున్నారు. మోదీ విషయాన్ని పక్కన పెడితే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు గెలిచినంత మాత్రాన అవి జాతీయ పార్టీలను ఎదుర్కోగల దమ్ముంటుందా? అవి కేంద్రంలోని అధికార పార్టీతో ఢీకొట్టే సామర్థ్యం ఉంటుందా.. అనేదే ప్రశ్న.
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్.. బీజేపీని ముప్పుతిప్పలు పెట్టింది. టీఎంసీని ఓడించేయబోతున్నామని.. దీదీ ఇంక ఇంటికే పరిమితమని మోదీ కూడా పలు సభల్లో ప్రకటించారు. కానీ రిజల్ట్స్ చూసిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. బీజేపీ డబుల్ డిజిట్ కూడా దాటలేదు. దీంతో మమత దేశాన్ని గెలిపించిందని.. బీజేపీ మెడలు వంచిందని.. మోదీకి దీదీయే ప్రత్యామ్నాయమని బోలెడు విశ్లేషణలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి అంత సీన్ ఉండదు. దీదీ హవా కేవలం పశ్చిమ బెంగాల్ వరకే పరిమితం. తన రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రం అడుగడుగునా ఆమె రాజీ పడాల్సి వస్తుంది. ఇందులో మమతకు మాత్రమే కాదు. ఏ పార్టీకి మినహాయింపు కాదు.. ఉండదు. దీదీ కూడా కేంద్రంతో గొడవ పెట్టుకోవాలనుకోదు.
ఇక తమిళనాడులో స్టాలిన్ పరిస్థితి కూడా ఇంతే. అన్నాడీఎంకేతో బీజేపీ కలిసి పోటీ చేసింది కాబట్టి ఆ డీఎంకే, బీజేపీ మధ్య గ్యాప్ వచ్చింది. లేకుంటే బీజేపీతో స్టాలిన్ కు ఎలాంటి శతృత్వమూ లేదు. కాంగ్రెస్ పార్టీతో ఎంత మంచి సంబంధాలున్నాయో.. బీజేపీతో కూడా అంతే సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు తమిళనాడు ప్రయోజనాలకోసం కేంద్రంలోని బీజేపీతో స్టాలిన్ కూడా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. స్టాలిన్ కూడా ఇందుకు సిద్ధంగానే ఉంటారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. అలా కాకుండా వైరం పెంచుకుంటూ పోతే అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు గెలిచిన పార్టీలే కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇవన్నీ జాతీయ పార్టీలను, ఇతర ప్రాంతీయ పార్టీలను ఢీకొట్టి అధికారంలోకి వచ్చినవే. ఎన్నికల వరకే కేంద్రంలోని జాతీయ పార్టీలతో పోరాడతాయి. ఆ తర్వాత అదంతా గతం. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలేవైనా కేంద్రంలోని అధికార పార్టీలతో స్నేహం చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటాయి. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కొట్టుకుంటున్నా.. కేంద్రంలోకి వచ్చేసరికి వాటి మధ్య ఎంతో అన్యోన్యత కనిపిస్తుంటుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఎప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి గులాములేనని చెప్పొచ్చు.