MSPపై తక్షణమే చట్టం తేలేం: కేంద్రం
పంటలకు కనీస మద్దతు ధర (MSP)పై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో రైతన్నల ఢిల్లీ చలో ఉద్రిక్తంగా మారింది.పంజాబ్ నుంచి ఢిల్లీకి ట్రాక్టర్లతో బయల్దేరిన అన్నదాతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతుల నిరసనపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్పీపై తక్షణమే చట్టం తీసుకురాలేమన్నారు. దీనిపై రైతు సంఘాలు చర్చలకు రావాలని సూచించారు.
విపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆందోళనను ఉపయోగించుకుంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. కనీస మద్దతు ధర పై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేం. దీనిపై అన్ని వర్గాల వారితో సుదీర్ఘ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకే, రైతు సంఘాలు ఆందోళన విరమించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చల కోసం రావాలన్నారు కేంద్రమంత్రి అర్జున్ ముండా.
ఈ ఆందోళన అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్ పంధేర్ తదితరులతో సోమవారం చర్చలు జరిపింది. రైతులు చేసిన డిమాండ్లలో కొన్నింటికి మంత్రుల బృందం అంగీకారం తెలపగా.. ఎంఎస్పీకి చట్టబద్ధతపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు.













