జస్టిన్ ట్రూడో.. జవాబ్ దో..
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతోంది. నిజ్జర్ హత్యకేసులో భారత్ ఏజెంట్ల హస్తముందని పలుమార్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతే కాదు.. దీనికి సంబంధించి భారత్‌కు వ్యతిరేకంగా పలుచర్యలు చేపట్టారు. దీనికి భారత్ సైతం గట్టి కౌంటరిచ్చింది. భారత్ లోని రాయభార కార్యాలయం నుంచి పలువురిని వెనక్కుతీసుకోవాలని కెనడాకు అల్టిమేటమిచ్చింది. దీంతో పలువురు కెనడా దౌత్యవేత్తలను ఆ దేశం వెనక్కు రప్పించింది. ఇరుదేశాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ చేశాయి. ఈ దశలో వీసాలను సైతం నిలిపివేసిన భారత్… తర్వాతి పరిణామాల్లో కాస్త సడలింపు నిచ్చింది. ఇరుదేశాల విదేశాంగమంత్రులు, అధికారుల మధ్య రహస్య చర్చలు జరిగినట్లు ప్రచారం సైతం జరిగింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యేసూచనలు కనిపించాయి. ఇంతలో భారత్ మరోసారి నిజ్జర్ హత్యకేసును ప్రస్తావించింది.
నిజ్జర్ హత్యకేసుకు సంబంధించి భారత నిఘా సంస్థ రా హస్తముందన్న కెనడా ప్రధాని ట్రూడో వాదనలను బలపరిచే ఆధారాలుంటే బయటపెట్టాలని భారత్ మరోసారి
డిమాండ్ చేసింది. జూన్‌లో నిజ్జర్ హత్య తర్వాత కెనడాపోలీసులు చేపట్టిన దర్యాప్తు ప్రభావితం చేసేలా ..ఆ దేశ అత్యున్నత అధికారులు బహిరంగ ప్రకటనలు చేశారన్నారు కెనడాలో భారత హైకమిషనర్ సంజీవ్ వర్మ. ఉద్దేశపూర్వకంగా ఓ కెనడా అధికారి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఈకేసు దర్యాప్తులో భారత్
సహకరించడానికి అవసరమైన ఆధారాలను ఇప్పటికీ సమర్పించేలేదన్నారు వర్మ. అసలు ఆధారాలు ఎక్కడున్నాయి? దర్యాప్తులో ఏమి తేలిందో చెప్పాలని వర్మ డిమాండ్ చేశారు. అదే సమయంలో సహచర దౌత్యవేత్తలకు పొంచి ఉన్న ముప్పును ప్రస్తావించారు వర్మ. తమకు ఏదైనా జరిగితే ఆదేవుడే కాపాడాలన్నారు.
అంతేకాదు.. దౌత్యవేత్తల సంభాషణలను ఎలా సేకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు భారత హైకమిషనర్. దౌత్యవేత్తల సంభాషణలకు అంతర్జాతీయ చట్టాల రక్షణ
ఉంటుంది. ఆ సంభాషణలను ఎలా సేకరించారో చూపించమనండి.. స్వరాన్ని అనుకరించి మాట్లాడిన మాటలు కాదని నిరూపించండి అని భారత హైకమిషనర్ వర్మ డిమాండ్ చేశారు. ఏదైనా వివాదాన్ని నిర్దేశిత కమ్యూనికేషన్ మార్గంలో.. నిర్దేశిత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత్‌ను విడదీయాలని
కొందరు కెనడా వాసులు చేస్తున్న ప్రయత్నాలకు ఎటువంటి సహకారం అందించొద్దని వర్మ సూచించారు.
ఇంత వివాదం చెలరేగుతున్నా… ఖలిస్థానీ అనుకూల వాదుల విషయంలో కెనడా నిస్తేజంగా వ్యవహరిస్తోంది.మరోసారి వారు రెఫరెండం నిర్వహించారు. అంతేకాదు.. దాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేపడుతూ… పంజాబీ యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ఈవ్యవహారంలో భారత్ ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు దౌత్యపరంగా చర్యలు చేపడుతూనే.. కెనడా తీరును ఎండగడుతోంది. మరోవైపు ప్రధాని ట్రూడో తీరును.. ఆదేశ విపక్షం కూడా తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ తో వివాదానికి ప్రధాని దిగారని విపక్షనేతలు ఆరోపిస్తున్నారు.మరోవైపు.. ప్రధాని ట్రూడో తీరుపై కెనడా పౌరులు సైతం అసహనంగా ఉన్నట్లు సమాచారం.













