గుజరాత్ ఎన్నికలకు మోగిన నగారా..! త్రిముఖ పోటీలో విజేతలెవరు..?
గుజరాత్ ఎన్నికలకు నగారా మోగింది. నెల రోజులలోపే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గుజరాత్ నుంచే ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేంద్రంలో అధికారానికి గుజరాత్ ను పునాదిగా భావిస్తుంటారు బీజేపీ నేతలు. అందుకే గుజరాత్ బైపోల్ ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇక కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో పాగా వేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది కానీ.. ఫలితం లేకుండా పోతోంది. ఈ రెండు పార్టీల మధ్యలో ఇప్పుడు ఆప్ కూడా చేరింది. గుజరాత్ లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. డిసెంబర్ 1న జరిగే మొదటి విడతకు ఈ నెల 5న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నవంబర్ 14వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 17వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. డిసెంబర్ 1న పోలింగ్ ఉంటుంది. ఇక.. ఈ నెల 10న రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ నెల 17వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 21వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. డిసెంబర్ 5న పోలింగ్ జరుగుతుంది. ఇక డిసెంబర్ 8న ఓట్లు లెక్కిస్తారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 5 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు. 51వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
గుజరాత్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 వరకూ ఉంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో గత ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు, కాంగ్రెస్ కు 77 సీట్లు వచ్చాయి. ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ బీజేపీ – కాంగ్రెస్ మధ్యే ఉండేది. అయితే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. మూడు పార్టీలూ ఇక్కడ దూకుడు మీదున్నాయి. అధికార బీజేపీ ఎప్పటి నుంచో పోల్ మేనేజ్ మెంట్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని శ్రమిస్తోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి కచ్చితంగా కమలం పార్టీని ఓడిస్తామని నమ్ముతోంది. మరోవైపు ఢిల్లీ, పంజాబ్ లలో అధికారం కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్ లో కూడా పాగా వేయాలనుకుంటోంది. అందుకోసం ఆ పార్టీ నేతలు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఆప్ అధినేత కేజ్రివాల్ బీజేపీపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముందే అభ్యర్థులను ప్రకటించారు. ఇన్నాళ్లూ ద్విముఖ పోటీ ఉన్న గుజరాత్ లో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. మరి చూద్దాం ఏ పార్టీ విజయం సాధిస్తుందో..!













