‘ఆర్డినెన్స్’ పై ఉమ్మడి పోరాటం…
దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై.. కేజ్రీవాల్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తోంది. ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే.. రాజకీయంగానూ పోరాటం ఉధృతం చేసింది. ఈ ఆర్డినెన్స్ ఇక్కడితో ఆగదని.. మిగిలిన రాష్ట్రాలకు వర్తించే అవకాశముందంటూ… ఆర్డినెన్స్ వ్యతిరేకించాలంటూ కేజ్రీవాల్… విపక్షనేతలకు సూచిస్తున్నారు. వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో ఆప్ కు కాంగ్రెస్ సానుకూల కబురు వినిపించింది.
కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ కు తాము మద్దతివ్వబోమని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. విపక్షాల భేటీ ముందురోజు.. ఈకీలక ప్రకటన చేసింది .బెంగళూరులో జరిగే విపక్షాల భేటీకి ఆప్ హాజరవుతుందని భావిస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రతినిధి కేసీ వేణుగోపాల్. దీనిపై ఆప్ స్పందించింది. ఇది సానుకూల పరిణామంగా అభివర్ణించింది. దీంతో విపక్షాల భేటీకి ఆప్ రావడం ఖాయమైందని చెప్పవచ్చు. ఫలితంగా విపక్ష కూటమి ప్రయత్నాలు మరింత వేగంగా ముందుకు సాగనున్నాయి.
కేంద్రానికి వ్యతిరేక కూటమిలో చేరుతున్న విపక్షాల సంఖ్య కూడా పెరుగుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమిలో చేరుతామంటూ ఇప్పటికే పలు పార్టీలు స్పష్టం చేశాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ పరిస్థితి .. జాతీయ పార్టీకి తక్కువ, ప్రాంతీయ పార్టీకి ఎక్కువ అన్నట్లు పరిహసించిన విపక్ష అగ్రనేతలు సైతం.. ఇప్పుడు హస్తం ప్రాముఖ్యాన్ని అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు..ఎక్కడికక్కడ బీజేపీని ఓడించి, సత్తా చాటాలని వివిధ పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. వీరికి కర్నాటకలో బీజేపీ ఓటమితో ఒక్కసారిగా కొండంత బలం చేకూరినట్లైంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ సమావేశమవుతున్నాయి. ఇప్పటికే పట్నాలో ఒకసారి భేటీ అయిన నేతలు.. బెంగళూరులో మరోసారి సమావేశం కానున్నారు. ఓవైపు జమిలి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందన్న ప్రచారం కొనసాగుతుండగా.. ఇప్పటికీ కూటమిపై పూర్తిస్థాయి చర్చలు జరగని పరిస్థితి. ఈపరిస్థితిలో విపక్ష కూటమి.. బలమైన మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.













