Bangladesh: బంగ్లాదేశ్ గడ్డపై డార్క్ ప్రిన్స్.. గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన బీఎన్పీ కేడర్…!
బంగ్లాదేశ్ లో కీలకనేత , బీఎన్పీ అధ్యక్షురాలు బేగం ఖలీదాజియా ఆరోగ్య పరిస్థితి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో యాక్టివ్ గా లేరని చెప్పాలి. దీంతో ఆమె వారసుడు.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్ పైనే .. పార్టీ కేడర్ ఆశలు పెట్టుకుంది. అయితే ఆయన 17 సంవత్సరాలుగా లండన్ లోనే నివాసముంటున్నారు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇన్నేళ్ల తర్వాత ఢాకా గడ్డపై అడుగుపెట్టారు తారిఖ్ రెహమాన్..దీంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఘన స్వాగతం పలికారు.
ఫిబ్రవరి, 2026లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో తారిఖ్ రెహమాన్ రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తారిఖ్ రెహమాన్.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు. ప్రస్తుతం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిని చూసేందుకే తారిఖ్ రెహమాన్ వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన రాక ప్రాధాన్యత సంతరించుకుంది. భార్య జుబైదా రెహమాన్, కూతురు జైమా రెహమాన్‌తో విమానంలో వస్తున్న ఫొటోలను తారిఖ్ రెహమాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
బుధవారం శక్తివంతమైన బాంబ్ పేలుడు కారణంగా ఢాకాలో ఒకరు చనిపోయారు. దీంతో మరొకసారి హింస చెలరేగింది. ఇలాంటి తరుణంలో తారిఖ్ రెహమాన్ రావడం.. ఆయన కోసం లక్షలాది మంది రోడ్లపైకి రావడంతో భద్రతా అధికారులకు తలనొప్పిగా మారింది. తొలుత విమానం బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ విమానాశ్రయంలో దిగింది. అక్కడ నుంచి ఢాకా చేరుకున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ బస్సులో తారిఖ్ రెహమాన్ అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఇదిలా ఉంటే తారిఖ్ రెహమాన్ రాకపై భారతదేశం సానుకూల సంకేతాలు వ్యక్తం చేస్తోంది. షేక్ హసీనా పార్టీ అవామీలీగ్ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితిలేకపోవడంతో.. ఇప్పుడు బీఎన్పీ వైపు ఇండియా చూస్తోంది. ఆ పార్టీ నేతలు సైతం మారిన రాజకీయపరిస్థితుల్లో ఇండియాతో కలిసి సాగేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీఎన్పీ గెలిస్తే.. తిరిగి సంబంధాలు మెరుగుపడతాయని భారత్ భావిస్తోంది.






