గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపేదెలా..? అమెరికా అంతర్మథనం..
గాజాపై ఇజ్రాయెల్ దాడిని నిలిపివేసే విషయంలో ఇజ్రాయెల్, అమెరికా మధ్య విభేదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ పిలుపునిస్తుండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిరాకరిస్తూ వస్తున్నారు. తాము చేస్తున్న పోరాటానికి అమెరికా ప్రజల మద్దతు సైతం ఉందని ఓ పోల్ సర్వేను ఉటంకిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్‌పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాన్ని ముగించాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తోందని బెంజమిన్ తెలిపారు. తాను సమర్థంగా తిప్పికొడుతూ వస్తున్నానని వివరించారు. ఇప్పటి వరకైతే గాజాలో విజయవంతంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.
ఇటీవల నిర్వహించిన హార్వర్డ్-హారిస్ పోల్‌లో దాదాపు 82 శాతం మంది అమెరికావాసులు తమకు మద్దతుగా నిలిచినట్లు తేలిందన్నారు. పూర్తి విజయం సాధించడానికి ఇది స్ఫూర్తి నింపుతుందన్నారు. వచ్చే సోమవారానికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని బైడెన్ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ పోరును మరింత ఉద్ధృతం చేస్తే ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయంగా మద్దతు లభించకపోవచ్చునని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
మరోవైపు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం దిశగా గణనీయ పురోగతి సాధించినట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. బైడెన్ సహా ఆయన బృందం వివిధ వర్గాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అయితే, అధ్యక్షుడు చెప్పినట్లుగా ఇప్పటి వరకైతే తుది ఒప్పందం ఖరారు కాలేదన్నారు. ఇంకా చాలా విషయాలు ఓ కొలిక్కి రావాల్సి ఉందని చెప్పారు. ఒక వేళ సంధి కుదిరితే అది ఆరు వారాల పాటు కొనసాగవచ్చన్నారు. ఆ సమయంలో వివాద శాశ్వత పరిష్కారానికి అడుగులు పడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తమ దౌత్యాధికారులు ఖతర్, ఈజిప్టు, ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఒప్పందాన్ని ఖరారు చేయడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. కానీ, హమాస్ నుంచి సానుకూల స్పందన రావాల్సి ఉందని చెప్పారు. మరోవైపు బందీల విడుదల కంటే వివాదానికి శాశ్వతంగా ముగింపు పలకడానికే తమ తొలి ప్రాధాన్యమని హమాస్ నేత ఒకరు తెలిపారు.













