Dhaka Protests: ఎవరీ ఉస్మాన్ హాదీ..? ఆయన మృతితో ఎందుకు బంగ్లాదేశ్ రగులుతోంది..?
విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మృతితో బంగ్లాదేశ్ మరోసారి రగులుతోంది.. విద్యార్థి ఉద్యమంతో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్… ఇప్పుడు దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.
భారత్ వ్యతిరేకి..ఉస్మాన్ హాదీ
బంగ్లాదేశ్‌లోని ఝల్కాతీ జిల్లాలో 1994లో ఉస్మాన్ హాదీ జన్మించాడు. చిన్నప్పటినుంచే ఉద్యమ భావజాలంతో ఉండే ఉస్మాన్.. విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. గతేడాది జులైలో అవామీలీగ్ నేత, నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్‌గా కీలక బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం భారత్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్‌లను పంచినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
గతేడాది విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ.. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్‌ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. ఈ పార్టీ వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యాడు. ఢాకా-8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన హాదీ.. డిసెబరు 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా అతడిపై దాడి జరిగింది.
హాదీ ఆటోలో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి అతి సమీపం నుంచి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గత శనివారం మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచాడు. తూటా గాయం కారణంగా హాదీ మెదడుకు తీవ్ర గాయమైందని వైద్యులు వెల్లడించారు.
హాదీ మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్‌లో ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు మీడియా కార్యాలయాలు, అవామీలీగ్ ఆఫీసులకు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు హాదీ మృతికి గానూ బంగ్లా ప్రభుత్వం ఒకరోజు సంతాపదినం ప్రకటించింది.






