రేపో మాపో 150 జిల్లాల్లో సంపూర్ణ లాక్ డౌన్?

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం కూడా మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ప్యూలు, లాక్ డౌన్ లు అమలవుతున్నాయి. ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి. శ్మశానాల దగ్గర క్యూలు దర్శనమిస్తున్నాయి. ఢిల్లీలో రెండు మూడు రోజులైనా దహన సంస్కారాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరి కేసుల కట్టడికి ప్రభుత్వం ఏం చేయబోతోంది.. ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాల వైఖరిపై ఘాటుగానే స్పందించింది. చర్యలు తీసుకోకపోతే ప్రేక్షక పాత్ర వహించబోమని స్పష్టం చేసింది.
దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగైనా దీన్ని కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలని ఇప్పటికే సూచనలు వస్తున్నాయి. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మొదటి విడత లాక్ డౌన్ తోనే ఎంతో నష్టపోయామని కేంద్రం భావిస్తోంది. అలా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించింది. ప్రధాని మోదీ కూడా కేసులు ఎక్కువగా ఉన్న చోట్ల మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశాయి. కొన్ని లాక్ డౌన్ కు వెళ్లాయి. మరికొన్ని నైట్ కర్ఫ్యూలు విధించాయి.
అయితే.. ఇంతటితో కరోనా కట్టడి సాధ్యం కాదనుకుంటున్న కేంద్రం.. మరో ప్రతిపాదనతో ముందుకొచ్చింది. కేసులు ఎక్కువగా ఉన్న చోట్ల అంటే.. కనీసం 15శాతం పాజిటివిటీ ఉన్న చోట్ల సంపూర్ణ లాక్ డౌన్ పెట్టాలని యోచిస్తోంది. ఇలా 15శాతం పాజిటివిటీ నమోదవుతున్న జిల్లాలు దేశంలో 150 వరకూ ఉన్నాయని అంచనా వేసింది. ఈ జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ విధించడం ద్వారా వైరస్ చైన్ ను బ్రేక్ చేయవచ్చనేది కేంద్రం ప్లాన్. ప్రాథమికంగా దీనికి అంగీకారం తెలిపిన కేంద్రం.. రాష్ట్రాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ రాష్ట్రాలు కూడా ఇందుకు సుముఖత తెలిపితే రేపో మాపో ఈ జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉంది.
మే 2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెడ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కేంద్రం మాత్రం ఇప్పటివరకూ లాక్ డౌన్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టడం సమంజసం కాదనే సూచన కూడా వినిపిస్తోంది. అందుకే ఎక్కడైతే రోగం ఉందో అక్కడ చికిత్స చేస్తే సరిపోతుందని యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకే కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల పైనే ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. 15శాతం పాజిటివిటీ రేటును ప్రామాణికంగా తీసుకుని జిల్లాల వారీగా లాక్ డౌన్స్ పెట్టేందుకు రెడీ అవుతోంది. మే 2వరకూ వెయిట్ చేయకుండా రేపోమాపో ఈ జిల్లాల్లో లాక్ డౌన్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.