ప్రాణయామతో…కరోనాని కట్టడి చేద్దాం..మోడీ
‘‘ప్రస్తుత కోవిడ్‌ను ఎదుర్కోవడంలో యోగా అత్యుత్తమం. ప్రాణయామ ద్వారా రోగనిరోధకశక్తి, శ్వాస కోస అనారోగ్యాలు దూరమవుతాయి’’ అంటూ చెప్పారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన మాట్లాడుతూ యోగాను జీవనవిధానంలో భాగం చేసుకుందామని ప్రపంచానికి పిలుపునిచ్చారు. మనం అందరం ఇంటి దగ్గరే కుటుంబంతో కలిసి యోగా చేయడం అనేది విశ్వవ్యాప్త సోదరభావాన్ని పెంపొందింస్తుందన్నారు. మనశ్శాంతిని, సానుకూల థృక్పధాన్ని యోగా అందిస్తుందన్నారు. యోగా ద్వారా ఆరోగ్యాన్ని నమ్మకాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళితే ఆరోగ్యకరమైన మానవత్వాన్ని ప్రపంచం చవి చూసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. కరోనా సంక్షోభం కారణంగా ఎన్నడూ లేనంతగా యోగా అవసరాన్ని ప్రపంచం గుర్తించిందన్నారు. మన రోగనిరోధకశక్తి బలంగా ఉంటే కరోనాని ఓడించగలమని, యోగాలోని అనేక శైలులు, ఆసనాలు దీనికి ఉపకరిస్తాయన్నారు. ఆ ఆసనాలు మన శరీరపు శక్తి సామార్ధ్యాలను ఇనుమడింపజేసి, మన మెటబాలిజం ప్రక్రియని శక్తివంతంగా మారుస్తాయన్నారు.
కోవిడ్ 19 వైరస్ ప్రధానంగా మన ఊపిరితిత్తుల ప్రక్రియపై దాడి చేస్తుందన్న ప్రధాని, శ్వాస కోస వ్యవస్థని బలోపేతం చేసుకోవడానికి శ్వాస కోస వ్యాయామమైన ప్రాణయామ అత్యంత ఉపయుక్తమన్నారు.
యోగా మనకు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుందని తద్వారా మనం సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతామని విజయాలు సాధించగలమన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘‘ఒక అనుసరణీయ వ్యక్తి తానుఅందరూ స్తబ్ధుగా ఉన్నప్పుడు కూడా చురుకుగా ఉండగలడని, అలాగే తీవ్రమైన చలనాలలో ఉన్నప్పుడు కూడా పూర్తి ప్రశాంతత అనుభూతించగలడని’’ అన్న స్వామి వివేకానంద సూక్తిని ఉద్ఘాటించారు.
సాంత్వమ్ యోగ ఉఛ్యతె అని యోగాకి అర్ధంగా పేర్కొన్నారు. సుఖదుఖాలందు, జయాపజయాలందు, అనుకూల వ్యతిరేక పరిస్థితులన్నింటా… ఒకే రకమైన స్థితిలో ఉండడమే దీని భావమని వివరించారు.













