మాతృభాషను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి: ఉపరాష్ట్రపతి
తెలుగు భాషాభివృద్ధికి తెలంగాణ సారస్వత పరిషత్తు పోషిస్తున్న పాత్ర చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. తెలంగాణ సారస్వత పరిషత్తు అంటే తనకు ప్రత్యేక అభిమానమని, మాతృభాషను నేర్చుకోవడం కూడా నేరంగా పరగణించే రోజుల్లో తెలుగు భాష సంరక్షణ కోసం 1943లో ఈ సంస్థ ఏర్పాటైందన్నారు. తన గురువు, తెలుగు ఆచార్యులైన పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పేరిట వెంకయ్య నాయుడు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన తొలి అవార్డును కోవెల సుప్రసన్నాచార్యకు అందజేశారు. అవార్డులు అందజేయడం ద్వారా మరెంతో మందికి ప్రేరణ కలుగుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటే మంచి ఆలోచనలకు బీసం పడుతుంది. మాతృభాషకు ప్రాధాన్యమిస్తున్న నూతన విద్యావిధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలన్నారు. శాస్త్ర సంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మాతృభాషలోనే అందించాలన్నారు. నేటికీ మాతృభాష గురించి చెప్పడం ఉద్యమించడం దురదృష్టకరం అన్నారు.













