3వ వేవ్ ఎలా ఉంటుంది?

కరోనా మొదటి వేవ్‍లో పెద్దగా ఇబ్బందులు పడని దేశం, సెకండ్‍వేవ్‍లో మాత్రం పడరాని కష్టాలను ఎదుర్కొంటోంది. సెకండ్‍వేవ్ ఇంతగా విజృంభించడానికి కారణంగా కోవిడ్ వైరస్‍లో వచ్చిన మార్పులే అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సెకండ్‍వేవ్‍లో ఎంతోమంది ప్రముఖులతోపాటు సామాన్యులు బలి అవుతున్నారు. ఇంకా ఈ సెకండ్‍వేవ్ ముగియకముందే మరో వేవ్ కూడా ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. దేశంలోకి కరోనావైరస్ మూడో దశ రాబోతోందని.. దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సంసిద్దులు కావాలని కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె. విజయరాఘవన్ అన్నారు. ‘దేశంలో రోజుకు మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా మూడో వేవ్ అనివార్యమైంది’ అని ఆయన అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయరాఘవన్ మాట్లాడుతూ.. ‘కరోనా మూడవ దశ అనివార్యం. ఈ మూడో దశ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టంగా తెలియదు. ప్రస్తుత వేరియంట్‍లకు వ్యతిరేకంగా టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా కొత్త వేరియంట్లు తలెత్తుతాయి. ఇవి వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతాయి. రోగనిరోధకాలు వ్యాధి తీవ్రతను తగ్గించేవిగా లేదా పెంచేవిగా మారతాయి. అందువల్ల మూడో దశను ఎదుర్కొనేందకు సిద్ధంగా ఉండాలి’ అని ఆయన అన్నారు.