విమానాల్లో మళ్లీ ఆ సదుపాయం!
రెండు గంటలు అంతకంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలను పునరుద్ధరించొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ పౌర విమానయాన శాఖకు తెలిపింది. అంతేగాక, ఇకపై విమాన సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాల్సిన అవసరం లేదని, అయితే గ్లౌజులు మాస్క్లు, ఫేస్షీల్డ్లు మాత్రం పెట్టుకోవాల్సిందేనని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దీంతో తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో తర్వలోనే మళ్లీ భోజన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఆగస్టు తర్వాత కొన్ని షరతులతో భోజన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో కొవిడ్ రెండో దశ విజృంభణ నేపథ్యంలో ఈ సేవలపై మళ్లీ ఆంక్షలు విధించారు. ఏప్రిల్ 15 నుంచి రెండు గంటల కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆరోగ్యశాఖకు కేంద్రం సూచనలు కోరింది. ఈ మేరకు రెండు గంటలు కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలు మొదలుపెట్టొచ్చని ఆరోగ్యశాఖ తెలిపింది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.













