సుధామూర్తిని విష్ చేసిన యూకే ప్రధాని
రచయిత్రి, విద్యావేత్త, వితరణశీలిగా దేశ ప్రజలకు సుపరిచితులైన సుధామూర్తి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. అమె ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులైన నారాయణ మూర్తి సతీమణి. ఆమె సాధించిన ఈ ఘనతపై బ్రిటన్ ప్రధాని, అల్లుడు రిషి సునాక్ స్పందించారు. సుధామూర్తి కుమార్తె అక్షతామూర్తి తన తల్లి సుధామూర్తికి దక్కిన గౌరవంపై గర్వపడ్డారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టారు. రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషణ్‌ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వపడ్డాను. సమాజం కోసం ఆమె చేసిన సేవకు ఈ పురస్కారాన్ని పొందారు. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. గుర్తింపు కోసం ఆమె ఎప్పుడూ ఎదురుచూడరు. కానీ పొందిన గుర్తింపు గొప్ప అనుభూతినిచ్చింది అంటూ అక్షత చేసిన పోస్టుపై రిషి సునాక్ స్పందించారు. గర్వించదగ్గ రోజు అంటూ వ్యాఖ్యను జోడించారు.













