రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా… పద్మ అవార్డుల ప్రదానోత్సవం
దేశ రాజధాని ఢిల్లీ లోని రాష్ట్రపతిభవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. 2020 ఏడాదికి సంబంధించి 148 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2021 ఏడాదికిగాను 119 మందికి అవార్డులను అందజేశారు. పద్మ అవార్డులు అందుకున్న 119 మందిలో ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
పద్మ అవార్డులు అందుకున్న వారిలో 29 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. 16 మందికి మరణానంతరం పద్మ పురస్కారాలు దక్కాయి. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ సాహూను, తెలుగు సినీరంగానికి చెందిన ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు పద్మభూషణ్ అవార్డు దక్కింది. అసోం మాజీ సీఎం తరుణ్ గోగోయ్‌కి మరణానంతరం పద్మభూషణ్ పురస్కారం దక్కగా ఆయన తరపున ఆయన సతీమణి అవార్డును అందుకున్నారు.













