ప్రధాని పుట్టినరోజు సందర్భంగా.. అరుదైన ప్రాజెక్టుకు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అరుదైన ఒక ప్రాజెక్టు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. మధ్య ప్రదేశ్లోని శివ్పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఒక ఖండంలో జీవిస్తున్న చిరుతపులులను మరొక ఖండంలో ప్రవేశపెట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఆఫ్రికా ఖండంలోని నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతపులులను ఇక్కడి కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టనున్నారు. కాగా, మోదీ పర్యటనను ఖరారు చేస్తూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) మధ్య ప్రదేశ్ సీఎంవోకు సమాచారం అందించింది. ఈ చీటా ప్రాజెక్టును ప్రారంభించాలంటూ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చైహాన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ప్రధాని పర్యటనకు ఒక రోజు ముందుగా నమీబియా నుంచి చిరుతలు కునో ప్రాంతానికి చేరుకోనున్నాయి. ఈ ప్రాంతంలో తాజాగా 10 హెలీప్యాడ్లు నిర్మించారు.













