సౌదీ యువరాజుతో ప్రధాని మోదీ భేటీ
ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థిరత్వం, సంక్షేమంలో భారత్-సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరుదేశాలు కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయన్నారు. ఇరుదేశాల సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక మార్గాలను అన్వేషించామన్నారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ భారత్‌లో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. జీ20 సదస్సును నిర్వహించినందుకు భారత్‌ను అభినందిస్తున్నానని అన్నారు. ఈ సదస్సు వల్ల యావత్ ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల గొప్ప భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని అన్నారు.













