దేశంలో సంపూర్ణ లాక్డౌన్ విధించం : సీతారామన్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ బలంగా ఉందని, అయినా తాము పూర్తి లాక్డౌన్ విధించమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో, జిల్లాల్లో మాత్రం నియంత్రణ చర్యలు చేపడతామని ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్తో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వర్చువల్ మీట్ నిర్వహించారు. భారతదేశానికి రుణం పెంచడానికి ప్రపంచ బ్యాంకు చేపట్టిన చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా కేంద్రం కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలను సీతారామన్ ఆయనకు వివరించారు. తాము ఐదు మంత్రాలతో ముందుకు సాగుతున్నామని వివరించారు. టెస్ట్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్, చికిత్స, సరైన విధానంలో వ్యవహరించడం లాంటి పద్ధతులతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ‘‘ దేశంలో సెకండ్ వేవ్ సాగుతోంది. అయినా తాము పూర్తి లాక్డౌన్ మాత్రం విధించం. ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయాలని భావించడం లేదు. క్షేత్ర స్థాయిలో క్వారంటైన్, జాగ్రత్తలు, ఐసోలేషన్ లాంటి వాటిపై దష్టి నిలిపాం. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొంటాం. పూర్తి స్థాయి లాక్డౌన్ మాత్రం విధించం’’ అని కేంద్ర మంత్రి సీతారామన్ పేర్కొన్నారు.













