రక్షణ-సాంకేతిక సహకారంపై ఇరు దేశాలు చర్చలు
రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఈ నెల 6న ఢిల్లీలో జరగనున్న సమావేశం ప్రధానంగా ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపైనే ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్జి తెలిపారు. భారత్, రష్యాల మధ్య జరుగుతున్న 21వ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించే ప్రతిపాదనలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకొంటారన్నారు. అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు, కొవిడ్‌ను సంయుక్తంగా ఎదుర్కోవడం వంటి అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వస్తాయన్నారు. అలాగే రక్షణ, సాంకేతిక సహకారంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సెర్గీ షోయిగు సమావేశమవుతారని తెలిపారు. విదేశాంగ మంత్రులు జై శంకర్, సెర్గీ లావ్రోన్ మధ్య కూడా ఇదే తరహా చర్చలు జరుగుతాయని, సెర్గీ లావ్రో ఈ నెల 5నే ఢిల్లీ చేరుకుంటారని తెలిపారు.













