ఢిల్లీలో భారీ పేలుడు…
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ప్రాణనష్టం మాత్రం సంభవించలేదు. గణతంత్ర దినోత్సవ బీటింగ్ రీట్రీట్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన సంభవించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇతరులు అక్కడికి చేరుకున్నారు. అయితే పూలకుండిలో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. ఈ పేలుడుకు ఐఈడీ ఉపయోగించారని పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
పేలుడుతో ఢిల్లీ అంతటా హై అలర్ట్
ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించడంతో పోలీసులు ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను పెంచేశారు. వీటితో పాటు ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు. మరోవైపు హోంశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఐబీ చీఫ్‌తో పాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ హాజరయ్యారు. పేలుడుపై వారందరూ అమిత్‌షాకు వివరించారు.
స్పందించిన ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం
ఈ పేలుడుపై ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం స్పందించింది. పేలుడు సంభవించిన నేపథ్యంలో తాము భారత ప్రభుత్వ అధికారులతో టచ్‌లోనే ఉంటున్నామని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నామని పేర్కొన్నారు. రాయబార కార్యాలయంలో ఉన్నవారందరమూ క్షేమంగానే ఉన్నామని ప్రకటించారు. ఈ పని తీవ్రవాదులే చేసి ఉంటారని ఇజ్రాయిల్ పేర్కొంది.













